ప్రయోగానికి గంట ముందు ఆగిన ‘చంద్రయాన్’.. త్వరలోనే తేదీ ప్రకటన

  • చంద్రయాన్-2ను మోసుకెళ్లే జీఎస్ఎల్‌వీ మార్క్-3లో సాంకేతిక సమస్యలు
  • తిరిగి ఎప్పుడు ప్రయోగించేదీ ప్రకటిస్తామన్న శాస్త్రవేత్తలు
  • ఈ నెలలో కష్టమేనంటున్న నిపుణులు
ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘చంద్రయాన్ 2’ ప్రయోగం నిలిచిపోయింది. ప్రయోగానికి సరిగ్గా 56 నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌డౌ‌న్‌ను నిలిపివేసిన ఇస్రో.. ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా నిలిపివేసింది. అనంతరం ప్రయోగాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. వాహక నౌక ‘జీఎస్ఎల్‌వీ మార్క్3’లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయోగం తిరిగి ఎప్పుడు నిర్వహంచేదీ త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

 నిజానికి సోమవారం తెల్లవారుజామున 2:51 గంటలకు ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. కౌంట్ డౌన్ కూడా పూర్తికావచ్చింది. ప్రయోగం అనుకున్న సమయానికి జరిగి ఉంటే చంద్రయాన్-2 ఈసరికి నిర్ణీత కక్ష్యలో చేరి ఉండేది. ప్రయోగాన్ని మళ్లీ చేపట్టాలంటే అందుకు అనువైన సమయం (లాంచ్ విండో) దొరికితే తప్ప సాధ్యం కాదు. సోమవారం పది నిమిషాల పాటు లాంచ్ విండో అందుబాటులో ఉండడంతోనే ప్రయోగం చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పుడది నిలిచిపోవడంతో తిరిగి ఎప్పుడన్నది ఆసక్తిగా మారింది. ఈ నెలలో పది నిమిషాల నిడివి వున్న లాంచ్ విండోలు లేవు. అన్నీ నిమిషం నిడివి ఉన్నవే ఉన్నాయి. కాబట్టి ఈ నెలలో ప్రయోగాన్ని తిరిగి చేపట్టే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు.
Go Back to Shorts
Chandrayan-2
ISRO
GSLV
sriharikota
Andhra Pradesh

More Telugu News